: 'కంగ్రాట్స్' చెప్పి బామ్మగారిని కంగారుపెట్టిన ఆసుపత్రి!
'పంచతంత్రం' సినిమా చూశారా? అందులో కమల హాసన్ డయాగ్నస్టిక్ రిపోర్ట్ మారిపోతుంది. దీంతో ఒకరికి చేయాల్సిన ఆపరేషన్ ఇంకొకరికి చేసేస్తారు. సినిమాల్లోనే కాదు, నిజజీవితంలో కూడా ఇలాంటి విచిత్రాలు జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఇంగ్లాండులో చోటుచేసుకుంది. అక్కడి హ్యాంప్ షైర్ లో ఉన్న ఓ ఆసుపత్రి...'శుభాకాంక్షలు, మీరు తల్లి కాబోతున్నారు. గర్భిణులకు అవసరమైన పరీక్షలు చేయించుకునేందుకు మీరు ఆసుపత్రికి రావాలి' అంటూ 99 ఏళ్ల డోరిస్ కు వైద్యులు అపాయింట్ మెంట్ లెటర్ పంపారు. ముగ్గురు పిల్లలు, 20 మంది మనవలు ఉన్న డోరిస్, ఆ లెటర్ లో తన పుట్టినతేదీ, తదితర వివరాలు సరిగ్గా ఉండడంతో అవాక్కైంది. రిపోర్ట్ తనదేనా? అంటూ లేఖ విషయమై ఆసుపత్రి సిబ్బందిని ఆరా తీయగా, అప్పుడు నాలుక కరచుకుని 'రిపోర్టు మారిపోయింది...క్షమించాల'ని వైద్యులు కోరడం కొసమెరుపు. ఏమైనా, బామ్మగారిని మాత్రం కాసేపు ఆ ఆసుపత్రివాళ్ళు కంగారు పెట్టేశారు!