: 2.75 లక్షల మంది ఇండియన్స్ 'వ్యక్తిగత రహస్యాలు' వెల్లడికానున్నాయి... టైమ్స్ సంచలన కథనం


సంప్రదాయాలు, విలువలు పాటించే భారతీయులకు ఆ వెబ్ సైటు హ్యాకింగ్ తరువాత అతిపెద్ద షాక్ తగలనుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం సుమారు 2.75 లక్షల మంది భారతీయుల వ్యక్తిగత రహస్యాలు, శృంగార దృశ్యాలు వెల్లడి కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 37 లక్షల మందికి పైగా యూజర్లు వాడుతున్న డేటింగ్ సైట్ 'ఆష్లీ మాడిసన్' హ్యాకింగ్ సమస్యను ఎదుర్కొంటోంది. 'ది ఇంపాక్ట్ టీమ్' పేరిట కార్యకలాపాలు సాగిస్తున్న ఓ టీమ్ ఈ వెబ్ సైటును హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. న్యూస్ ఏజన్సీ రాయ్ టర్స్ తెలిపిన వివరాల ప్రకారం, లక్షల మంది యూజర్ల నగ్న చిత్రాలు, పర్సనల్ వీడియోలతో పాటు వారి క్రెడిట్ కార్డుల సమాచారం కూడా వీరి వద్ద ఉంది. వీరిలో 2.75 లక్షల మందికిపైగా భారతీయులూ ఉన్నారు. భాగస్వాములను మోసం చేస్తూ, వివాహేతర సంబంధాలు పెట్టుకోవాలని చూసే వారు, విచ్చలవిడి శృంగారాన్ని కోరుకునే వారు ఈ వెబ్ సైట్లో యూజర్లుగా ఉన్నారు. తమ వెబ్ సైట్ హ్యాకింగునకు గురైందని 'ఆష్లీ మాడిసన్' వెబ్ సైట్ ను నిర్వహిస్తున్న అవిడ్ లైఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. హ్యాకింగ్ నకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించింది. కాగా, ఈ వెబ్ సైట్ లోని ఎవరి సమాచారాన్నైనా పూర్తిగా డిలీట్ చేయాలంటే కొంత మొత్తాన్ని తమకు చెల్లించాలని 'ది ఇంపాక్ట్ టీమ్' ఇప్పటికే వెల్లడించింది. అందుకోసం 'పెయిడ్ డిలీట్' పేరిట కొత్త బటన్ ఉంచుతామని తెలిపింది. ఇదే సమయంలో సమాచారాన్ని చెరిపివేసే సదుపాయాన్ని తాము అందరు కస్టమర్లకూ ఉచితంగానే అందిస్తామని అవిడ్ లైఫ్ పేర్కొంది. కొన్ని శాంపిల్ చిత్రాలను, వారికి సంబంధించిన నిజమైన పేర్లను, నగ్న చిత్రాలను హ్యాకర్లు విడుదల చేశారని తెలుస్తోంది. 'లైఫ్ ఈజ్ షార్ట్. హ్యావ్ యాన్ అఫైర్' అనే స్లోగన్ తో వచ్చిన ఆష్లీ మాడిసన్ సుమారు 200 మిలియన్ డాలర్ల నిధుల సేకరణ లక్ష్యంగా త్వరలోనే లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఐపీఓకు రానున్న నేపథ్యంలో ఈ హ్యాకింగ్ ఘటన జరగడం గమనార్హం.

  • Loading...

More Telugu News