: పాకిస్థాన్ లో అంతే!... ప్రధానికి ఉగ్రనేతలు హెచ్చరికలు జారీ చేస్తారు!
పాకిస్థాన్ లో అంతే! దేశాన్ని పాలించే ప్రధానమంత్రి అంతటివాడిపైనా పెత్తనం చెలాయించాలని ప్రయత్నిస్తుంటారక్కడి ఉగ్రవాద సంస్థల నేతలు. తాజాగా, జమాత్ ఉద్ దవా సంస్థ అధినేత, ముంబయి పేలుళ్ల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ కూడా అదే పంథాలో పయనించాడు! అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి భారత్ తో ఏకపక్షంగా మైత్రికి ప్రయత్నించరాదని ఏకంగా దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ నే హెచ్చరిస్తున్నాడు. అలాంటి చర్యలతో కాశ్మీరీలు నష్టపోతారని పేర్కొన్నాడు. కాశ్మీర్ ప్రస్తావన లేకుండా భారత్ తో చర్చలు జరపరాదని స్పష్టం చేశాడీ ముష్కర నేత. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లను పట్టించుకోకుండా, పాకిస్థాన్ తన ప్రధాన పంథాకు కట్టుబడి ఉండాలని సూచించాడు. ఇటీవలే రష్యాలో భారత్, పాక్ ప్రధానులు సమావేశమై, చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, హఫీజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్ కు స్నేహ హస్తం చాచేకంటే కాశ్మీర్ ప్రజల తరపున నిలబడడమే పాక్ సర్కారుకు మేలని హఫీజ్ పేర్కొన్నాడు.