: ఆటో డ్రైవర్ని సోషల్ మీడియా 'హీరో'ను చేసేసింది... ఆటో రుణమూ తీరిపోయింది!
ఓ మామూలు ఆటో డ్రైవర్ ఇప్పుడు ఉన్నట్టుండి సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. ఒక్క ప్రయాణం అతనికి పాప్యులారిటీ తెచ్చేసింది. అంతేకాదు, తన ఆటో రుణం మాఫీ అయిపోయింది. ఓలా కంపెనీకి అంతులేని పేరు ప్రఖ్యాతులు, వేల మంది యువతుల అభిమానానికి పాత్రుడయ్యాడు. క్యాబ్, ఆటో డ్రైవర్ల వికృత చేష్టల వార్తలతో విసిగి వేసారిపోయిన నెటిజన్లకు ఈ బెంగళూరు ఆటోవాలా సంస్కారం ఎంతగానో నచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే, బెంగళూరులో స్నేహితులను కలిసేందుకు వెళ్లిన రజని శంకర్ అనే మహిళ ట్యాక్సీలపై నమ్మకం లేక ఓలా యాప్ నుంచి ఆటో బుక్ చేసుకుంది. ఈ కంపెనీ గసంఫార్ అలీ అనే డ్రైవర్ ను పంపింది. ప్రయాణానికి ముందే దూరం 38 కిలోమీటర్లని, దారి చీకటిగా ఉంటుంది కనుక భయపడవద్దని సూచించాడు. అంతే కాకుండా, ఆమె గమ్యం చేరిన తరువాత స్నేహితులు వచ్చేందుకు 20 నిమిషాల సమయం పడుతుందని తెలుసుకుని, ఆటో దిగవద్దని, స్నేహితులు వచ్చాక అప్పగిస్తానని చెప్పాడు. ఆమె స్నేహితులు వచ్చాక, వారికి ఆమెను అప్పగించి వచ్చిన దారిన వెళ్లిపోయాడు. రజని శంకర్ మాత్రం తన ఆందోళన, డ్రైవర్ చెప్పిన ధైర్యం, చేసిన ప్రయాణం గురించి ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. దీంతో గసంఫార్ అలీ రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. బెంగళూరు మున్సిపల్ కమిషనర్ అలీని కలిసి అభినందించారు. ఆటో రుణం మాఫీ చేశారు. ఓ 38 కిలో మీటర్ల ప్రయాణం అతనిని సోషల్ మీడియా 'హీరో'ను చేస్తే, ఆటో కోసం తీసుకున్న రుణం కూడా మాఫీ అయింది. 'మంచి నడవడి ప్రయోజనకరమే' అని గసంఫార్ అలీ రుజువు చేశాడు.