: చంద్రబాబును కూడా వదలని తలసాని
పార్టీ ఫిరాయింపులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చెబుతారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దేశంలోని అన్ని శాసనసభల్లో ఒకే చట్టం అమలైనప్పుడు, తెలంగాణలో వర్తించిన నిబంధనలు ఆంధ్రప్రదేశ్ లో వర్తిస్తాయా? లేదా? అని అడిగారు. మరి అలాంటప్పుడు ఇతర పార్టీల గుర్తులతో గెలిచిన అభ్యర్థులు టీడీపీలో చేరినప్పుడు లేని అభ్యంతరం, తనకు మాత్రమే ఎందుకు వర్తిస్తుందని ఆయన నిలదీశారు. దీనిపై చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు కాళ్లరిగేలా తిరగడం తప్ప ఇంకేమీ జరగదని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతల్లా తనకు డొంక తిరుగుడు తెలియదని, ఏదైనా సూటిగా వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు కూడా రాజకీయం తెలుసని, తాను కూడా రాజకీయాల్లోనే ఉన్నానని ఆయన గుర్తు చేశారు. టీడీపీ నేతలను డ్రామాలు ఆడించడం మానాలని, రెండు రాష్ట్రాల్లో ఒకే చట్టాలు, నిబంధనలు అమలవుతున్నాయని ఆయన చంద్రబాబుకు స్పష్టం చేశారు. తాను దేనికీ భయపడడం లేదని, ఉపఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని తలసాని తెలిపారు.