: 4 బంతుల్లో 3 వికెట్లు... సఫారీలు వణికిపోయారు!
టీమిండియాతో వన్డే సిరీస్ ద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్ గడప తొక్కిన బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ తాజాగా టెస్టు క్రికెట్లో కాలుమోపాడు. పేరుమోసిన భారత బ్యాట్స్ మెన్ కు తన పేస్ రుచి చూపి వికెట్ల పంట పండించుకున్న ఈ యువ బౌలర్... చిట్టగాంగ్ లో మంగళవారం సఫారీలను వణికించాడు. తొలి ఇన్నింగ్స్ లో ముస్తాఫిజూర్ బంతి అందుకోకముందు 3 వికెట్లకు 173 పరుగులతో ఉన్న దక్షిణాఫ్రికా ఆపై విలవిల్లాడిపోయింది. నిప్పులు చెరిగే పేస్ తో విరుచుకుపడిన ముస్తాఫిజూర్ 4 బంతుల్లో 3 వికెట్లు తీసి పర్యాటక జట్టు వెన్నువిరిచాడు. ఇన్నింగ్స్ 60వ ఓవర్ ను ఈ లెఫ్టార్మ్ సీమర్ వికెట్ మొయిడెన్ చేయడంతో స్కోరు బోర్డుపై 173 పరుగులే కనిపించాయి, వికెట్ల పతనం మాత్రం 6కి చేరింది. ఆమ్లా (13), డుమినీ (0), డి కోక్ (0) వంటి హేమాహేమీలు ఈ బక్క పలుచని పేసర్ ను ఎదుర్కోలేక విఫలమయ్యారు. పిచ్ మీద పడ్డ బంతి ఎటు వస్తుందో అర్థం కాక చేతులెత్తేశారు.