: త్వరలో కాంగ్రెస్ లో వైసీపీ విలీనమవుతుంది: గాలి ముద్దుకృష్ణమ జోస్యం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు జోస్యం చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందస్తుగా ఓ ఒప్పందం జరిగిందని, అది ఇప్పుడు అమలవుతోందని చెప్పారు. అందుకే పలువురు కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరుతున్నారన్నారు. తరువాత అందరూ కలసి జగన్ ను కాంగ్రెస్ లోకి తీసుకువెళతారని, అలా కాంగ్రెస్ లో వైసీపీ విలీనం జరుగుతుందని గాలి వివరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దొనకొండ రాజధాని అవుతుందని వైసీపీ నేతలందరూ భూములు కొన్నారని, దొనకొండలో రాజధాని రానందుకే అమరావతిపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోందని విమర్శించారు. ఇదే సమయంలో, త్వరలో ఏపీలో రాహుల్ గాంధీ భరోసా యాత్రపై స్పందిస్తూ, వైఎస్ హయాంలో 1400 మంది రైతులు చనిపోతే అప్పుడెందుకు యాత్రలు చేయలేదని గాలి ప్రశ్నించారు.