: భళా ఇన్ఫోసిస్... టీసీఎస్ ను మించిన లాభాలతో 15 శాతం దుమికిన ఈక్విటీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ అద్భుత ఫలితాలను నమోదు చేసింది. గడచిన 15 త్రైమాసికాల్లో ఎన్నడూ లేనంతగా, ఆదాయ వృద్ధిని నమోదు చేసి 'భళా' అనిపించింది. దేశంలోని రెండవ అతిపెద్ద ఔట్ సోర్సింగ్ సేవల సంస్థగా సేవలందిస్తున్న ఇన్ఫోసిస్ ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో 4.5 శాతం డాలర్ రెవెన్యూ గ్రోత్ సాధించింది. ఇదే సమయంలో వాల్యూముల పరంగా సంస్థ 19 త్రైమాసికాల తరువాత అత్యధికంగా 5.4 శాతం వృద్ధిని చూపింది. ఈ ఫలితాలు ఇన్ఫీకి ప్రధాన పోటీదారుగా ఉన్న టీసీఎస్ ఫలితాలతో పోలిస్తే మెరుగ్గా ఉండటం ఇన్వెస్టర్లకు సైతం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కాగా, ఈ సంవత్సరం వార్షిక అమ్మకాల అంచనా భారత కరెన్సీలో 10 నుంచి 12 శాతం పెరగవచ్చని, డాలర్లలో 7.2 నుంచి 9.2 శాతం పెరుగుతుందని భావిస్తున్నామని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూ.బీ. ప్రవీణ్ రావు మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక రూపాయిల్లో గణాంకాలను పరిశీలిస్తే, సంస్థ నికర లాభం రూ. 3,030 కోట్లకు, ఆదాయం రూ. 14,354 కోట్లకు చేరాయి. అంతకుముందు విశ్లేషకులు సంస్థ నికర లాభం రూ. 3,019 కోట్లకు, ఆదాయం రూ. 14,066 కోట్లకు చేరవచ్చని అంచనా వేశారు. అంచనాలకు మించిన ఫలితాలను నమోదు చేయడంతో పాటు ఈ త్రైమాసికంలో కొత్తగా 79 క్లయింట్ల నుంచి కాంట్రాక్టులు లభించాయని ఇన్ఫీ ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లో ఈక్విటీ విలువ ఒక్కసారిగా ముందుకు దూకింది. క్రితం ముగింపుతో పోలిస్తే, ఏకంగా 15 శాతం పెరిగింది. ఉదయం 10:40 గంటల సమయంలో ఇన్ఫీ ఈక్విటీ విలువ రూ. 1,095 వద్ద కొనసాగుతోంది. ఒకదశలో రూ. 1,110 రూపాయల వరకూ కూడా వెళ్లింది. సంస్థ టాప్ లైన్ గ్రోత్ గణాంకాలు సంతృప్తికరంగా ఉన్నాయని, ముందుముందు మెరుగైన లాభాల వృద్ధి నమోదు కావచ్చని ఎంకే గ్లోబల్ డైరెక్టర్ ధనుంజయ్ సిన్హా వ్యాఖ్యానించారు.