: ఎనిమిదో రోజూ అదే జోరు... పుష్కర ఘాట్లకు పోటెత్తిన భక్తజనం
పవిత్ర గోదావరి మహా పుష్కరాలు నేటితో ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. తొలి రోజు నుంచే పుష్కర స్నానాల కోసం ఘాట్లకు పోటెత్తుతున్న భక్తజన సందోహం ఎనిమిదో రోజు కూడా ఏమాత్రం తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లోని పుష్కర ఘాట్లకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో పుష్కర ఘాట్లకు దారితీసే ప్రధాన రహదారులపై భారీ రద్దీ నెలకొంది. పలు ప్రాంతాల్లో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణలోని అన్ని పుష్కర ఘాట్లలో భక్తుల కోలాహలం నెలకొంది. నేడు తెల్లవారుజాము నుంచే ఇరు రాష్ట్రాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.