: పోలీసులను హేళన చేసిన కేజ్రీవాల్... 'తుల్లా' అన్నందుకు కేసు నమోదు
ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోలీసులను హేళన చేసేలా మాట్లాడినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై కేసు నమోదైంది. ఆగ్నేయ ఢిల్లీ డీసీపీ మన్ దీప్ సింగ్ రాంధ్వా తెలిపిన వివరాల ప్రకారం, కేజ్రీవాల్ పోలీసులను 'తుల్లా' (ఢిల్లీ ప్రాంతంలో పోలీసులను పిలిచే అమర్యాదకర పదం) అన్నారు. ఇది ఆక్షేపణీయమని గోవింద్ పురి పోలీసు స్టేషనులో విధులు నిర్వహిస్తున్న హర్వీందర్ అనే కానిస్టేబుల్ కేసు పెట్టాడు. అవినీతి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, "ఓ 'తుల్లా' వీధి వ్యాపారి నుంచి డబ్బు తీసుకుంటున్నాడంటే, అది ఆమోదయోగ్యం కాదు. మేము తప్పకుండా కేసు పెడతాం" అని కేజ్రీవాల్ ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అమర్యాదకర పదాలు వాడుతూ, కేజ్రీవాల్ అలా మాట్లాడటాన్ని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ సైతం ఖండించడం గమనార్హం. గౌరవ ముఖ్యమంత్రి అటువంటి పదాలు వాడకుండా ఉండాల్సిందని ఆయన అన్నారు.