: రాజీనామాపై తలసాని స్పందిస్తారు: శ్రీనివాస గౌడ్
ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశాకే, టీఆర్ఎస్ లో చేరానని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటలన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. తలసాని రాజీనామా తమ వద్ద లేదని తెలంగాణ శాసనసభ సచివాలయం తెలపడంతో తలసాని అడ్డంగా బుక్కైనట్టయింది. ఈ ఘటన జరిగి ఒకరోజు గడిచిపోయినప్పటికీ... తలసాని మాత్రం ఇంతవరకు స్పందించలేదు. దీంతో, రాజీనామా చేశానని చెబుతూ తలసాని డ్రామా ఆడారని జనాలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, ఈ వివాదానికి తాత్కాలిక ముగింపు పలికేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ యత్నించారు. తన రాజీనామా విషయంలో తలసాని స్పందిస్తారని చెప్పారు. గతంలో ఎన్నడూ జరగనిది ఇప్పుడే జరిగిందనే విధంగా కాంగ్రెస్, టీడీపీలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. గతంలో రాజీనామాలను పెండింగులో పెట్టి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అమెరికా వెళ్లారని... దాంతో పలువురు తెలంగాణ బిడ్డలు కూడా బలైపోయారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని తలసానికి మంత్రి పదవి ఇవ్వడంపై కొందరికి బాధ ఉండవచ్చని... అయితే ఆయన అనుభవాన్ని, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చి ఉంటారని తెలిపారు.