: తొక్కిసలాటతో సీఎం షాక్ అయ్యారు... చనిపోయిన వారి సంఖ్య తెలుసుకున్నాకే వెళ్లారు: డీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్పీ
డక్కన్ క్రానికల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... పుష్కర ఘాట్ వద్ద ప్రత్యేక విధులు నిర్వహిస్తున్న ఎస్పీ విజయకుమార్ ఆరోజు జరిగిన విషయాలను వెల్లడించారు. పుష్కరాలు ప్రారంభమైన తొలిరోజు పెను తొక్కిసలాట జరిగిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడే ఉన్నారని ఆయన తెలిపారు. తొలుత నలుగురు చనిపోయారని తాను చంద్రబాబుకు చెప్పానని, దీంతో ఆయన షాక్ కు గురయ్యారని చెప్పారు. వెంటనే, అసలేం జరిగింది? ఎంత మంది చనిపోయారు? అనే కచ్చితమైన వివరాలు కావాలని అడిగారని... వెంటనే పూర్తిగా కనుక్కుని 11 మంది మరణించారని చెప్పినప్పుడు, "అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపట్టండి" అని చెప్పి అక్కడనుంచి వెళ్లిపోయారని ఆయన చెప్పినట్టు పత్రిక ప్రచురించింది. పుష్కర ఘాట్లలో చేసిన ఏర్పాట్లు నాసిరకంగా ఉన్నాయని, బారికేడ్లు ఏర్పాటు విషయంలో మరింత జాగరూకత వహించి ఉంటే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారట. చంద్రబాబు స్నానం ఆచరించే సమయంలోనే తాము కూడా పుష్కరస్నానం చేయాలని చాలా మంది భక్తులు భావించారని... అందుకే ఘాట్ వద్ద భక్తుల సంఖ్య పెరిగిపోయిందని ఆయన చెప్పారు. దీనివల్లే తొక్కిసలాట జరిగింది అని ఆయన అన్నట్టు పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.