: ఫస్ట్ స్పైస్ జెట్, ఆపై ఇండిగో!
ఇండియాలో విమాన ప్రయాణికులు అత్యధికంగా కోరుకునే ఎయిర్ లైన్స్ కంపెనీ ఏదో తెలుసా? లోకాస్ట్ క్యారియర్ గా పేరు తెచ్చుకున్న స్పైస్ జెట్! ఆ తరువాత ఎక్కువమంది ప్రిఫర్ చేసేది ఇండిగో ఎయిర్ లైన్సే నని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాలు వెల్లడించాయి. స్పైస్ జెట్ లో 93.2 శాతం లోడ్ ఫ్యాక్టర్ ఉండగా, ఇండిగో రెండో స్థానంలో నిలిచి సరాసరిన 86.6 శాతం ప్రయాణికులతో సర్వీసులను కొనసాగిస్తోంది. దీంతో రెండు వరుస నెలల్లో 90 శాతానికి పైగా డిమాండ్ నమోదైన ఎయిర్ లైన్స్ సంస్థగా స్పైస్ జెట్ నిలిచింది. తాము నడుపుతున్న ప్రతి 10 విమాన సర్వీసుల్లో 9 పూర్తి స్థాయి ప్రయాణికులతో నడుస్తున్నాయని స్పైస్ జెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ వివరించారు. తెల్లవారుఝాము విమానాలైనా, రాత్రి పూట నడుస్తున్నవైనా ఒకేవిధమైన డిమాండ్ కనిపిస్తోందని తెలిపారు. టికెట్ల ధరల విషయంలో తాము అవలంబిస్తున్న స్మార్ట్ డిస్కౌంట్ పాలసీయే ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ విమానమైనా 35 శాతం సీట్లు ఖాళీగా ఉండి ప్రయాణిస్తే, ఆ ట్రిప్ లో నష్టపోయినట్టేనని ఆయన అన్నారు.