: అమ్మా బైలెల్లినాదో..!
ముస్లింలకు పవిత్రమైన రంజాన్ ప్రశాంతంగా ముగియడంతో, తెలంగాణ గడ్డ బోనాల పండగకు ముస్తాబైంది. 'అమ్మా బైలెల్లినాదో...' అంటూ భక్తులు ఆనందోత్సాహాల మధ్య గోల్కొండ బాట పట్టారు. నేడు ఆషాఢ మాసం తొలి ఆదివారం కావడంతో, గోల్కొండ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గత రాత్రి నుంచే గోల్కొండకు తరలిన భక్తులు, అక్కడే టెంట్లు వేసుకుని రాత్రంతా జాగారం చేశారు. తెల్లవారుఝాము నుంచి భక్తుల రాక భారీగా పెరగడంతో గోల్కొండ కోటలో సందడి నెలకొంది. తెలంగాణ ఏర్పడిన తరువాత బోనాల పండగను అధికారికంగా నిర్వహించేందుకు కేసీఆర్ సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో, మరిన్ని నిధులు కేటాయించి వీధివీధినా ఉన్న అమ్మవార్ల గుడులను రంగులతో ముస్తాబు చేశారు. ఈసారి ఉత్సవాలను మరిన్ని హంగులతో నిర్వహిస్తామని ఇప్పటికే వెల్లడించిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అవసరం అయిన ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు, తాగునీరు, రోడ్ల మరమ్మతు వంటి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేసినట్టు తెలిపారు. కాగా, ఆగస్టు 2, 3 తేదీల్లో సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాలు జరుగుతాయి. ఆ తరువాత వచ్చే ఆదివారం, అంటే, ఆగస్టు తొమ్మిది, పదవ తేదీల్లో పాతబస్తీలో బోనాలు జరగనున్నాయి.