: కాశ్మీర్ హోదాపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. జమ్మూకాశ్మీర్ సార్వభౌమత్వాన్ని, స్వయం ప్రతిపత్తిని శాసనపరంగా కానీ, చట్టపరంగా కానీ ఎవరూ ప్రశ్నించలేరని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. 2002లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 'సెక్యూరిటైజేషన్, రీ కన్ స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్, ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్' చట్టాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేయడం కుదరదని జస్టిస్ ఎంఏ అత్తర్, జస్టిస్ ఏఎం మాంగ్రేతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రాజరికంలో ఉండగా, భారత యూనియన్ లో చేరేందుకు విలీన ఒడంబడికపై సంతకం చేసిన తరువాత, సొంత రాజ్యాంగంలోని అంశాల దృష్ట్యా కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని ఎవరూ ప్రశ్నించలేరు. మార్పులు చేర్పులు చేయలేరు. ప్రశ్నించడానికి కుదరదని తేల్చిచెప్పారు. దీంతో మరోసారి ఆర్టికల్ 370పై దేశవ్యాప్తంగా చర్చ రేగుతోంది. కేవలం ఆర్టికల్ 370 కారణంగానే జమ్మూకాశ్మీర్ కు పరిశ్రమలు, పెట్టుబడులు రావడం లేదని, దీంతో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రం అభివృద్ధికి దూరంగానే నిలుస్తోందని అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే.