: బిడ్డ వేళకు తినడు, నిద్రపోడు... ఇలా అయితే ఎలా?: గ్రీస్ ప్రధాని ఆరోగ్యంపై తల్లి ఆందోళన
గ్రీస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడంతో ఆ దేశ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ (40) ఊపిరి సలపనంత బిజీ అయ్యారు. ఇటీవలే బెయిలవుట్ కు యూరోపియన్ యూనియన్ పచ్చజెండా ఊపడం గ్రీస్ కు ఊరట కలిగించేదే అయినా, అందుకు దేశంలోని వ్యవస్థలు ఎన్నో కఠిన సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే గ్రీస్ ఆర్థిక వ్యవస్థ గట్టెక్కుతుంది. ఈ నేపథ్యంలో, ప్రధాని సిప్రాస్ నిద్రాహారాలు మాని శ్రమిస్తున్నారట. ఏదో కొంచెం తిని వెళ్లిపోతున్నాడని, సరిగా నిద్రపోవడం లేదని ఆయన తల్లి అరిస్టి సిప్రాస్ (73) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మధ్య తన కుమారుడిని సరిగా చూడనేలేదని వాపోయింది. తన కుటుంబాన్ని చూసుకునేంత తీరిక లేకుండా శ్రమిస్తున్నాడని ఆమె మీడియాకు తెలిపింది. ఎప్పుడైనా మాట్లాడితే, దేశం కోసం అత్యుత్తమ నిర్ణయాలు తీసుకోమని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంటానని వివరించింది. బాధ పడవద్దని, అన్నీ చక్కబడతాయని తనకు బదులిస్తాడని అరిస్టి తెలిపింది.