: బీసీసీఐకి మరోదారి లేదంటున్న మాజీ అధ్యక్షుడు
ఐపీఎల్ ఫిక్సింగ్ భూతం వెలుగుచూసిన వెంటనే బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బోర్డు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ అన్నారు. ఆనాటి ఉదాసీనత ఫలితంగానే... ఇప్పుడు లోథా కమిటీ నిర్ణయాలకు బోర్డు తప్పనిసరిగా తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. అంత సంక్షోభం తలెత్తినా, ప్రతిష్ఠ మెరుగుపర్చుకునేందుకు బోర్డు తీసుకున్న చర్యలు శూన్యమని తెలిపారు. అందుకే, లోథా కమిటీ నిర్ణయాలను తప్పనిసరిగా అమలు చేయడం తప్ప బీసీసీఐ ముందు మరోదారి లేకుండాపోయిందన్నారు. మనోహర్ ఈ సందర్భంగా ఎన్.శ్రీనివాసన్ పైనా ధ్వజమెత్తారు. 2013లో స్పాట్ ఫిక్సింగ్ వెలుగుచూడగానే, బీసీసీఐ అధ్యక్ష పదవికి శ్రీనివాసన్ వెంటనే రాజీనామా చేసి ఉండాల్సిందని, కానీ, ఆయన అలా చేయలేదని దుయ్యబట్టారు. అన్ని కుంభకోణాలకు ఎన్.శ్రీనివాసన్ కూడా కారకుడేనని ఆరోపించారు. ఐసీసీ చైర్మన్ పదవి నుంచి ఆయన తప్పుకోవాలని డిమాండ్ చేశారు.