: హైదరాబాద్ నగరాన్ని 'సినీ రాజధాని'గా తీర్చిదిద్దాలి: సినీ నటుడు సుమన్
హైదరాబాద్ నగరాన్ని సినీ పరిశ్రమ రాజధానిగా తీర్చిదిద్దాలని సినీ నటుడు సుమన్ కోరుతున్నారు. సినిమా షూటింగ్ లకు హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతమని పేర్కొన్నారు. నగరంలోని మోత్కూరులో ఉన్న సంతోష్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు. పరిశ్రమ కోసం సీఎం కేసీఆర్ 2వేల ఎకరాలు కేటాయిస్తానని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. తాను సినీ పరిశ్రమలో 37 సంవత్సరాలుగా దాదాపు 350 సినిమాల్లో నటించానన్న ఆయన, దేవుడి పాత్రలు పోషించడంలో ఎన్టీఆర్ తరువాత స్థానం తనకే దక్కిందని వివరించారు. తెలంగాణలో ప్రతిభావంతులైన కళాకారులను తాను ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్నది తానొక్కడినేనని సుమన్ గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో రిజర్వేషన్లపై మాట్లాడుతూ, కులాల రిజర్వేషన్లు రాష్ట్రానికో విధంగా ఉండటం సరికాదన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధాని నరేంద్రమోదీ ఈ సమయంలోనే జాతీయ స్థాయిలో సమాన రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని తాను మోదీ వద్దకు తీసుకెళతానన్నారు.