: రాజమండ్రిలో అన్నీతానై... సీఎం చంద్రబాబు ఆల్ రౌండ్ షో
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై పుష్కరాల తొలినాడు రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట తీవ్ర ప్రభావం చూపినట్టుంది. పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఆయనను కలచివేసింది. దీంతో, రాజమండ్రిలోనే మకాం వేసిన సీఎం అన్ని ప్రభుత్వ వ్యవస్థలను సమన్వయపరిచే బాధ్యతను తానే స్వీకరించారు. ఓ వైపు భక్తుల భద్రత, మరోవైపు రవాణా వ్యవస్థ నియంత్రణ, ట్రాఫిక్ పునరుద్ధరణ, పారిశుద్ధ్యం... ఇలా అన్ని వ్యవస్థలను పర్యవేక్షిస్తూ మంత్రులకు మార్గదర్శనం చేస్తున్నారు. క్షేత్రస్థాయి అధికారులతో కూడా ఆయన మాట్లాడుతూ, వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తద్వారా, తీసుకోవాల్సిన చర్యలపై అప్పటికప్పుడే ప్రణాళికలు రూపొందించి అమలు చేయిస్తున్నారు. జీపీఎస్ వంటి ఆధునిక వ్యవస్థలను కూడా ఈ సందర్భంగా ఉపయోగిస్తూ బాబు తన టెక్నో మార్కును ప్రదర్శించడం విశేషం. తొక్కిసలాట విషాద ఘటనను పక్కనబెడితే, ప్రస్తుత ఏర్పాట్ల పట్ల భక్తులందరూ సంతృప్తి చెందుతున్నారు.