: తమిళనాట 'అమ్మ' సిమెంటుకు అదిరిపోయే స్పందన
తమిళనాడు సీఎం జయలలిత పేరిట రాష్ట్రంలో ప్రారంభమైన పలు పథకాలకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. వాటిలో 'అమ్మ సిమెంట్' ప్రముఖమైనది. రాయితీతో ప్రజలకు సిమెంట్ సరఫరా చేయాలన్నదే పథకం వెనుక ఉన్న ఉద్దేశం. జయ గతేడాది సెప్టెంబర్ 26న ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 5న తిరుచిరాపల్లి జిల్లాలో పథకాన్ని అమల్లోకి తేగా, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చారు. తమిళనాడు సిమెంట్స్ కార్పొరేషన్ తెలిపిన గణాంకాల ప్రకారం... జులై 16 నాటికి దాదాపు 5.17 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ (కోటి సిమెంట్ సంచులు) విక్రయించారు. 470 గోడౌన్ల ద్వారా 1,33,595 మంది లబ్ధిదారులకు ఈ సిమెంట్ అందించారు. సిమెంట్ సంచి ఒక్కింటికి రూ.190 మాత్రమే వసూలు చేయడంతో అపూర్వ స్పందన లభించింది. పథకం అమల్లోకి తీసుకువచ్చిన 15 రోజుల్లోనే లక్ష సంచులు అమ్ముడయ్యాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ పథకం ఎంత హిట్టయ్యిందో!