: భవిష్యత్తులో ఏం చేస్తామో మీరే చూస్తారు!: టాటా మోటార్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీ


దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థగా గుర్తింపున్న టాటా మోటార్స్ భవిష్యత్తులో నూతన సాంకేతికత, వినూత్న ప్రొడక్టుల తయారీపై దృష్టిని సారిస్తూ, భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయాన్ని సంస్థ చైర్మన్ సైరస్ మిస్త్రీ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులకు తెలిపారు. "దీర్ఘకాల వృద్ధి అవకాశాలే లక్ష్యంగా, భారత వాహన పరిశ్రమలో సరికొత్త వ్యూహాలను అమలు చేయాలని భావిస్తున్నాం. యాంత్రీకరణలో ఇండియా రెండంకెల వృద్ధిని కళ్లజూడనుంది. కొత్త ప్రొడక్టులు, టెక్నాలజీల విభాగాల్లో పెట్టుబడుల ద్వారా భవిష్యత్తుకు బాటలు వేస్తాం. అంతర్జాతీయంగానూ మరింతగా ఎదిగేందుకు కృషి చేస్తాం" అని టాటా మోటార్స్ 70వ వార్షిక సమావేశంలో మిస్త్రీ అన్నారు. వివిధ సెగ్మెంట్లలో డిమాండుకు తగ్గట్టుగా పాసింజర్, వాణిజ్య వాహన తయారీ దిశగా రూ. 3 వేల కోట్ల మూలధనాన్ని కేటాయించనున్నట్టు సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. "వాణిజ్య వాహన రంగంలో ముందున్న టాటా మోటార్స్ ఇకపై పాసింజర్ కార్ల విషయంలో కస్టమర్ల ఊహలకు అనుగుణంగా ఉండేలా నడుచుకుంటుంది. భవిష్యత్తులో ఏం చేస్తామో మీరందరూ చూస్తారు" అని మిస్త్రీ వివరించారు. కాగా, గత కొంత కాలంలో దేశీయ వాహన రంగంలో నెలకొన్న పోటీలో తన స్థానాన్ని నిలుపుకోవడానికి టాటా మోటార్స్ ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిన్న కార్లు, ఎస్ యూవీల విషయంలో హ్యుందాయ్, హోండా, మారుతీ సుజుకి తదితర కంపెనీల నుంచి వస్తున్న పోటీ సంస్థ అమ్మకాలను దెబ్బతీసింది.

  • Loading...

More Telugu News