: బీసీసీఐకి కొత్త చీఫ్?... దాల్మియాకు అనారోగ్యమే కారణమని వదంతులు
బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించడం ఆయనకు తలకు మించిన భారంగానే పరిణమిస్తోందట. దీంతో పదవి నుంచి తప్పుకోవాలని ఆయనను బోర్డు సభ్యులు కోరనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతేకాక సెప్టెంబరులో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం తర్వాత బీసీసీఐకి కొత్త చీఫ్ రానున్నారన్న వదంతులూ జోరందుకున్నాయి. ఇక పదవి నుంచి తప్పుకోవాలని జగ్మోహన్ దాల్మియాకు చెప్పేంత ధైర్యం ఎవరికుంది? ప్రస్తుతం బోర్డు సభ్యుల్లో ఈ స్థాయి ధైర్యం చేసే సభ్యుడెవరూ లేరట. అందుకే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో దాల్మియాకు చెప్పించేందుకు సభ్యులు ప్రయత్నిస్తున్నారని వినికిడి. ‘‘ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ బోర్డు అధ్యక్షుడిగానూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బీసీసీఐ లాంటి సంస్థకు పూర్తి ఫిట్ నెస్ ఉన్న అధ్యక్షుడి అవసరం ఎంతైనా ఉంది. భారత క్రికెట్ కు దాల్మియా సేవలు మరువలేనివే. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగా లేదు. అతడు తప్పుకోవాలి. వచ్చే ఏడాది ఐసీసీ టీ20కి భారత్ ఆతిథ్యమివ్వనుంది. అంతేకాక వచ్చే బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దాల్మియా తప్పుకుంటేనే బాగుంటుంది. అరుణ్ జైట్లీ చెబితే, దాల్మియా వింటాడు’’ అని బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.