: ‘పాలమూరు ఫైట్’ వేదిక చేంజ్...సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ‘రావుల’ కోసం ‘జూపల్లి’ వెయిటింగ్


మహబూబ్ నగర్ జిల్లాలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డిల మధ్య కొనసాగుతున్న సవాళ్లు, ప్రతిసవాళ్లకు ఫుల్ స్టాప్ పడేలా లేదు. ప్రాజెక్టులపై బహిరంగ చర్చ కోసం పట్టుబడుతున్న మంత్రి జూపల్లి మూడు రోజులుగా అదేపనిగా పెట్టుకున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా మారిన జూపల్లి ప్రాజెక్టులకు సంబంధించిన పేపర్లు పట్టుకుని రెండు రోజుల పాటు అసెంబ్లీ హాల్లో కూర్చున్నారు. అయితే అసెంబ్లీలో సభ్యత్వం లేని తాను అక్కడికెలా వస్తానంటూ రావుల దెప్పిపొడిచారు. దీంతో జూపల్లి వెనువెంటనే వేదికను మార్చేశారు. కొద్దిసేపటి క్రితం తన అధికారిక నివాసం నుంచి నేరుగా సోమాజీగూడలోని హైదరాబాదు ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. అక్కడి నుంచే మీడియా ద్వారా రావులకు ‘‘చర్చకు సిద్ధంగా ఉన్నాను.. మీదే ఆలస్యం’’ అంటూ ఆయన లేఖ పంపారు. చర్చకు జర్నలిస్టులే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారని కూడా ఆయన రావులకు సూచించారు. మరి దీనిపై రావుల ఎలా స్పందిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News