: ఆ మహిళను మోదీ ప్రభుత్వం వెంటాడుతోందా?


తన గురించి తాను ఎంతో గొప్పగా చెప్పుకునే మోదీ ప్రభుత్వం ఓ మహిళా సామాజిక కార్యకర్తను వేధిస్తోందా? కటకటాల వెనక్కి నెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోందా? ఔననే అంటున్నారు సామాజిక కార్యకర్తలు. వివరాల్లోకి వెళ్తే... కేంద్రం నుంచి, గుజరాత్ ప్రభుత్వం నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్న ఆ మహిళా సామాజిక కార్యకర్త పేరు తీస్తా సెతల్వాద్. 2002 గుజరాత్ అల్లర్లపై ఆమె ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు. దీంతో, ఇప్పటికే ఆమెపై ఐపీసీ 120బీ, విదేశీ విరాళాల చట్టం-1976లతో పాటు వివిధ సెక్షన్ల కింద జులై 8న కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు నిన్న ముంబైలోని ఆమె నివాసం, ఆమె నిర్వహిస్తున్న ఎన్జీవో సంస్థలపై ఏక కాలంలో నాలుగు చోట్ల దాడులు చేశారు. తీస్తా సెతల్వాద్ తన భర్తతో కలసి సబ్రాంగ్ కమ్యూనికేషన్స్, సబ్రాంగ్ ట్రస్ట్, సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ సంస్థలను నిర్వహిస్తున్నారు. 1992-93లో ముంబైలో జరిగిన హిందూ-ముస్లిం అల్లర్లకు చలించిపోయిన ఆమె... అప్పట్నుంచి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 2002లో సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ సంస్థను స్థాపించి, గుజరాత్ అల్లర్లకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. దీంతో, అప్పటి వరకు అంతర్జాతీయంగా ప్రశంసలు, అవార్డులు అందుకున్న ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. బాధితుల తరపున పోరాటాన్ని ప్రారంభించిన ఆమె, బాధితుల చేత పిటిషన్లు వేయించడం, న్యాయ నిపుణుల సలహాలు అందించడం, సాక్షులను సమీకరించడం లాంటివెన్నో చేశారు. ఆమె స్థాపించిన సంస్థ పోరాటం వల్లే అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీపై సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసింది. అయితే సరైన ఆధారాలు లేవంటూ మోదీకి, ఆయన సన్నిహితులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో వారు ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేయగా.... దాన్ని అడ్మిషన్ దశలోని దిగువ కోర్టు కొట్టివేసింది. దీంతో పైకోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్, రివ్యూ పిటిషన్ ను 2014 మార్చి 15న వేశారు. దీనిపై ఈ నెల 27న అహ్మదాబాద్ కోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే, తీస్తాపై కేసు నమోదైంది. కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండా ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి 2.90 లక్షలను ఆమె నడుపుతున్న ట్రస్టు విరాళంగా తీసుకుందన్న ఆరోపణలతో సోదాలు నిర్వహించారు. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరగనుందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News