: ఎంసీసీ మాట ఐసీసీ వింటుందా?
వ్యవస్థాగతంగా క్రికెట్ ను నడిపించేది ఐసీసీయే అయినా, ఆటకు సంబంధించినంతవరకు ప్రాథమిక అంశాలు, మార్పులు చేర్పులపై ఎంసీసీ మాటే అధికంగా చెల్లుబాటవుతుంది. బ్యాట్ బరువు, బంతి చుట్టుకొలత, పిచ్ పొడవు, మైదానం కొలతలు... ఇలాంటివన్నీ ఎక్కువగా ఎంసీసీయే చూసుకుంటుంది. మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ కు సంక్షిప్త రూపమే ఎంసీసీ. ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ మైదానం ఎంసీసీకి చెందినదే. 1787లో ఈ క్లబ్ ను స్థాపించారు. తాజాగా, లండన్ లో నిర్వహించిన సమావేశంలో ప్రధానంగా క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చాలన్న అంశంపై చర్చించారు. క్రికెట్ ను ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో చేర్చేందుకు ఐసీసీ కృషి చేయాలని ఎంసీసీ పేర్కొంది. ఐసీసీలోని అన్ని సభ్యదేశాల బోర్డులు కూడా అందుకు మద్దతు తెలపాలని సూచించింది. క్రికెట్ ప్రపంచవ్యాప్తం అయ్యేందుకు ఒలింపిక్స్ మంచి వేదికగా ఉపయోగపడుతుందని ఎంసీసీ సభ్యులు అభిప్రాయపడ్డారు. టి20 ఫార్మాట్ అయితే ఒలింపిక్స్ లో ఆడేందుకు అనువుగా ఉంటుందని వారు పేర్కొన్నారు. 1900లో పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో క్రికెట్ ప్రవేశపెట్టారని ఎంసీసీ వెల్లడించింది. అంతేగాకుండా, వన్డే వరల్డ్ కప్ ను 10 జట్లతోనే నిర్వహించాలన్న ఐసీసీ నిర్ణయాన్ని ఎంసీసీ తప్పుబట్టింది. 2019, 2023 ప్రపంచకప్ టోర్నీల్లో పది జట్లతోనే ఆడాలన్నది విపరీత నిర్ణయం అని, అది క్రికెట్ పురోగతికి హానికరమని అభిప్రాయపడింది. అనుబంధ సభ్యదేశాలకు కూడా ఆడే అవకాశం కల్పించాలని, అప్పుడే క్రికెట్ కు మార్కెట్ పెరుగుతుందని తెలిపింది.