: రాజమండ్రి పోలీస్ కంట్రోల్ రూంలో చంద్రబాబు...సీసీ కెమెరాల ద్వారా పుష్కరాలపై సమీక్ష
గోదావరి పుష్కరాల్లో భాగంగా నిన్న జరిగిన తొక్కిసలాట తరహా ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను ఏపీ ప్రభుత్వం చేపట్టింది. నిన్న ఘటన జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు జరిగిన ఘోరాన్ని తలచుకుని కన్నీరు పెట్టారు. భారీ ఏర్పాట్లు చేసినా ప్రమాదం జరగడంపై అంతర్మథనంలో పడ్డారు. తప్పు జరిగిందని భావిస్తే క్షమించండని కూడా ఆయన భక్తులను కోరారు. పుష్కరాలు ముగిసేదాకా అక్కడే ఉంటానని ప్రకటించిన చంద్రబాబు, నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత పుష్కర ఘాట్లను సందర్శించారు. తాజాగా ఆయన కొద్దిసేపటి క్రితం రాజమండ్రి పోలీస్ కంట్రోల్ రూంకు వెళ్లారు. అక్కడే కూర్చున్న ఆయన , పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పుష్కర ఏర్పాట్లకు సంబంధించి పలు సలహాలు, సూచనలను ఆయన అక్కడి నుంచే అధికారులకు ఇస్తున్నారు.