: మహీ లేని ఐపీఎల్ ఊహించుకోడం కష్టమే... లిటిల్ మాస్టర్ కామెంట్!


టీ20 తొలి వరల్డ్ కప్ ను భారత్ కు అందించిన టీమిండియా కెప్టెన్, జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ ఆ ఫార్మాట్ కు ఎనలేని గుర్తింపు తెచ్చాడు. చివరి ఓవర్లలో హెలికాప్టర్ షాట్లతో విరుచుకుపడటమే కాక వినూత్న ప్రణాళికలతో టీ20 టాప్ ప్లేయర్లలో అగ్రగణ్యుడిగానూ కెప్టెన్ కూల్ నీరాజనాలందుకున్నాడు. ఇక బీసీసీఐకి కాసుల వర్షాన్ని కురిపించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అతడి సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండు సార్లు టైటిల్ ను ఎగరేసుకుపోయింది. అయితే బెట్టింగ్ ఆరోపణల నేపథ్యంలో చెన్నైతో పాటు రాజస్థాన్ రాయల్స్ పైనా రెండేళ్ల నిషేధం వేటు పడింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోనీ ఆడటం ప్రశ్నార్థకంగా మారింది. ఇదే విషయంపై లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మహేంద్ర సింగ్ ధోనీ లేని ఐపీఎల్ ను ఊహించుకోవడమే కష్టం. ఎవరో చేసిన తప్పులకు చెన్నై, రాజస్థాన్ జట్లపై వేటు పడటం ఆటగాళ్లకు శరాఘాతమే. ఇక తర్వాతి ఐపీఎల్ కు కేవలం 8 నెలల సమయమే ఉండటంతో కొత్త జట్లను వెతకడం కూడా బీసీసీఐకి కష్టమైన పనే’’ అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News