: అది ప్రభుత్వ తప్పిదం కాదు... ప్రవచనకర్తల పాపమే!: గరికపాటి నరసింహారావు
గోదావరి పుష్కరాల్లో భాగంగా తొలిరోజే రాజమండ్రిలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ తెలుగు టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే తెరలేపాయి. 27 మంది మరణానికి కారణమైన తొక్కిసలాటలో ప్రభుత్వ తప్పిదం ఏమాత్రం లేదని నరసింహారావు పేర్కొన్నారు. ప్రవచనకర్తలు చేసిన తప్పుడు ప్రచారం కారణంగానే తొక్కిసలాట చోటుచేసుకుందని ఆయన అన్నారు. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ పుష్కరాలు మహా పుష్కరాలని చెప్పడంలో అర్థం లేదని నరసింహారావు వాదించారు. మహా పుష్కరాల్లో స్నానమాచరిస్తే పుణ్యం వస్తుందని చెప్పడంలో ఎంతమాత్రం తప్పులేదని ఆయన తెలిపారు. అయితే మహా పుష్కరాల్లో స్నానం చేయకపోతే... మహాపాపం చుట్టుకున్నట్టేనని, జన్మం మొత్తం వ్యర్థమవుతుందని కొందరు ప్రవచనకర్తలు చెప్పారన్నారు. అంతేకాక మహా పుష్కరాల్లో స్నానం చేయకపోతే పిశాచి జన్మ ఎత్తుతామంటూ మరికొందరు ప్రవచనకర్తలు చెప్పడంతో భక్తులు పుష్కరాలకు పోటెత్తారని, ఇదే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా నిలిచిందని నరసింహారావు పేర్కొన్నారు.