: ములాయం బెదిరించలేదు, సలహా ఇచ్చారంతే!: తండ్రికి అఖిలేశ్ మద్దతు
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ మధ్య వివాదంపై ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ములాయం తనను ఫోన్ లో బెదిరించారని ఠాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఠాకూర్ పై రేప్ కేసు నమోదు కావడం తెలిసిందే. అయితే, తన తండ్రి ములాయం ఫోన్ లో సీనియర్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ను బెదిరించలేదని, ఆయనకు సలహా ఇచ్చారని అఖిలేశ్ అంటున్నారు. ఠాకూర్ కు పరిస్థితుల పట్ల అవగాహన కలిగించేందుకు ములాయం ప్రయత్నించారని తండ్రికి మద్దతుగా మాట్లాడారు. అంతకుముందు, శనివారం నాడు యూపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనను ములాయం ఫోన్ చేసి బెదిరించారని, తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని ఠాకూర్ లక్నో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజే ఠాకూర్ పై రేప్ ఆరోపణల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఘజియాబాద్ కు చెందిన ఓ మహిళ ఠాకూర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేసింది. ఠాకూర్ భార్య కూడా భర్తకు సహకరించిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.