: మరో వివాదంలో ఏపీ మంత్రి పీతల సుజాత... ఇతర శాఖల్లో తలదూర్చిన వైనం


ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. మొన్నటికి మొన్న మంత్రి ఇంటి వద్ద రూ.10 లక్షల నగదును ఓ మహిళ వదిలి వెళ్లారు. ఈ వివాదంలో ఎలాగోలా బయటపడ్డ మంత్రి, తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. తనది కాని శాఖల్లో తలదూర్చిన మంత్రికి ఏం చెప్పాలో తెలియక అటు అటవీ శాఖాధికారులతో పాటు, ఇటు రెవెన్యూ శాఖ అధికారులూ తలలు పట్టుకుంటున్నారు. మంత్రి మాట కాదనలేని రెవెన్యూ అధికారుల అత్యుత్సాహంపై చిర్రెత్తుకొచ్చిన అటవీ శాఖాధికారులు విషయాన్ని లీక్ చేశారు. అసలు విషయమేంటంటే... పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి మంత్రి పీతల సుజాత ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చింతలపూడి మండలం నామవరం గ్రామానికి చెందిన సర్వే నెం.26లో 47.15 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై అటవీ, రెవెన్యూ శాఖల మధ్య చాలాకాలంగా వివాదం నడుస్తోంది. జిల్లాలోని బరికొండ రిజర్వ్ ఫారెస్ట్ కు చెందిన ఈ భూమిని రెవెన్యూ అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని అటవీ శాఖ ఆరోపిస్తోంది. ఈ వివాదం ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉంది. దీనిపై సమగ్రంగా సర్వే చేసి నివేదికను అందజేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఇదే పనిలో ఉన్నారు. అయితే సదరు సర్వే నివేదికతో పాటు మొత్తం ఆ ఫైలునే తనకు పంపాలని మంత్రి పీతల సుజాత రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రెవెన్యూ శాఖ, అటవీ శాఖకు లేఖ రాసింది. సర్వే పూర్తికాలేదని అటవీ శాఖ చెప్పినా, మంత్రి గారు పట్టు వదలకుండా లేఖలపై లేఖలు రాసేస్తున్నారు. వివాదంలోని ఈ భూమితో పాటు దాని పక్కనే మరో 15 ఎకరాలను మంత్రిగారి బంధువునని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి ఇటీవల కొనుగోలు చేశారట. ఈ క్రమంలోనే ఆ భూమికి సంబంధించిన ఫైలు కోసం మంత్రి తన పరిధి దాటి లేఖలు రాస్తున్నారని జిల్లా అధికార వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

  • Loading...

More Telugu News