: బీసీసీఐ అధ్యక్షుడి నివాసాన్ని ముట్టడించాలని బీహార్ క్రికెటర్ల నిర్ణయం
బీహార్ క్రికెటర్లు, రాష్ట్ర క్రికెట్ సంఘం అధికారులు బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా నివాసాన్ని ముట్టడించనున్నారు. బీహార్ క్రికెట్ సంఘం పట్ల ఉదాసీన వైఖరి కనబరుస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు బీసీసీఐలో పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్ తో వారు కోల్ కతాలో దాల్మియా నివాసం వద్ద ఈ నెల 25న ఆందోళన చేయాలని నిర్ణయించారు. బీహార్ ఆటగాళ్ల సంఘం (బీపీఏ) ఆధ్వర్యంలో ఈ ఘెరావ్ చేపడుతున్నారు. బీహార్ క్రికెట్ సంఘం పట్ల బీసీసీఐ చిన్నచూపుకు నిరసనగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బీపీఏ అధ్యక్షుడు మృత్యుంజయ్ తివారీ తెలిపారు. బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పటి నుంచి తమను పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. 2008లో జార్ఖండ్ కు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించిన బీసీసీఐ తమకు మాత్రం అనుబంధ సభ్యత్వం కల్పించిందని చెప్పారు. ఆ సభ్యత్వాన్ని కూడా 2011 తర్వాత పునరుద్ధరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.