: ఈ ఒక్క రంగంలోనే 1.5 కోట్ల ఉద్యోగాలు రానున్నాయ్!


వచ్చే ఏడేళ్లలో భారత వాహన పరిశ్రమ 1.5 కోట్ల కొత్త ఉద్యోగాలను దగ్గర చేయనుందని నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) వెల్లడించింది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ సెక్టారులో 1.91 కోట్ల మంది ఉపాధిని పొందుతున్నారని వివరించింది. బ్రిక్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) దేశాలే ప్రపంచ వృద్ధికి అత్యంత కీలకమని, మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ వేతనాలకు కార్మికులు దొరుకుతుండడంతో మరిన్ని కంపెనీలు భారత్ కేంద్రంగా ఉత్పత్తి కర్మాగారాలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయని ఎన్ఎస్డీసీ తన తాజా నివేదికలో పేర్కొంది. మారుతున్న సాంకేతికతకు తోడు కార్ల జీవితకాలం తగ్గుతుండడం కొత్త ఉద్యోగాల సంఖ్యను పెంచుతోందని వివరించింది. ఇండియాలో 76 లక్షల మంది మాన్యుఫాక్చరింగ్ సెక్టారులో ఉద్యోగులుగా ఉండగా, అందులో 72 శాతం మంది వాహన పరిశ్రమల్లోనే పనిచేస్తున్నారని తెలిపింది. ఈ రంగంలోని 70 శాతం కంపెనీలు విడిభాగాల తయారీలో నిమగ్నమైన చిన్న, మధ్యతరహా సంస్థలేనని పేర్కొంది. భారత స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలలో ఆటోమొబైల్ రంగం 22 నుంచి 25 శాతం వాటాను సొంతం చేసుకుందని ఎన్ఎస్డీసీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దిలీప్ చినాయ్ వ్యాఖ్యానించారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా మానవ వనరులను సమీకరించుకునేందుకు ఆటో ఇండస్ట్రీ ముందడుగు వేస్తుండటం శుభ సూచకమని వివరించారు.

  • Loading...

More Telugu News