: నోటి మాట కాదు, రాతపూర్వక హామీ కావాల్సిందే: తీవ్రరూపం దాల్చిన టీ-మునిసిపల్ కార్మికుల సమ్మె
తెలంగాణలో మునిసిపల్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె మరింత తీవ్రరూపం దాల్చింది. నేటితో ఆరో రోజుకు చేరుకున్న సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు తెరతీశారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద వేల సంఖ్యలో గుమిగూడిన కార్మికులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే కార్మికులతో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి దఫదఫాలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నిన్న జరిగిన చర్చల్లో భాగంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగానే ఉన్నామని నాయిని చెప్పారు. దీంతో కొంతమంది కార్మికులు సమ్మె విరమణకు ఒప్పుకున్నారు. అయితే, మెజారిటీ కార్మికులు మాత్రం నోటి మాట సరిపోదని మంత్రికి తేల్చిచెప్పారు. తాము ప్రస్తావించిన 17 సమస్యలపై రాతపూర్వకంగా స్పష్టమైన హామీ కావాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. నేటి ఆందోళనలో భాగంగా జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్మికులు హైదరాబాదుకు తరలివస్తున్నారు.