: పద్మావతీ మహిళా వర్శిటీ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఈ మధ్యాహ్నం కళాశాల భవనంపై నుంచి దూకి తనువు చాలించింది. అక్కడ చదువుతున్న ఇతర విద్యార్థినులను ఈ ఘటన తీవ్ర విషాదంలో నింపింది. నగరంలోని బాలాజీ కాలనీకి చెందిన హిందూసా (18) మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత భవనంపైకి ఎక్కి దూకేసింది. దీన్ని గమనించిన తోటివారు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో ఆమె మరణించింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హిందూసా చిన్నప్పటి నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆమె మరణం వెనుక కారణాలను దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.