: నువ్వు తెలంగాణ ద్రోహివి కాదా?: జూపల్లికి రేవంత్ ప్రశ్న
కేసీఆర్ పంచన చేరినంత మాత్రాన జూపల్లి కృష్ణారావు తెలంగాణ పోరాట యోధుడైపోతాడా? అని టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వాలు తెలంగాణకు అన్యాయం చేశాయని జూపల్లి అనడం దొంగలే 'దొంగ దొంగ' అంటున్నట్టు ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కాదా? అని నిలదీశారు. గతంలో అధికారంలోకి వచ్చిన రెండు ప్రభుత్వాల్లో జూపల్లి భాగస్వామి అని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు గత ప్రభుత్వాన్ని తిట్టేస్తే చేసిన పాపాలు పోతాయా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతి టీఆర్ఎస్ నేత తెలంగాణ తెలుగుదేశం నేతలు ఏమయ్యారంటున్నారని, తాము ఎక్కడికీ పోలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల కోలాహలానికి కారణం దివంగత వైఎస్సార్ ఆత్మ అని, వైఎస్ అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని శాసించిన ఆత్మ మరోసారి ప్రాజెక్టుల పేరుతో నిధులు దోచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన ఆరోపించారు. కేవీపీ అనే వైఎస్సార్ ఆత్మ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆవహించిందని ఆయన పేర్కొన్నారు. గతంలో కమీషన్లు తీసుకుని రాష్ట్రాన్ని పీల్చిపిప్పిచేసిన కేవీపీ, కేసీఆర్ ప్రభుత్వంలో కొత్త ప్రాజెక్టులకు తెరలేపారని, కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులు నిజంగా అంత గొప్పవే అయితే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎందుకు పేర్కోలేదని ఆయన ప్రశ్నించారు. కల్వకుర్తి, భీమ, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఎవరు ప్రారంభించారో టీఆర్ఎస్ నేతలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. అలాగే గతంలో పూర్తయిన ఇతర ప్రాజెక్టులు ఎవరు పూర్తి చేశారో కూడా తెలుసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పెద్దలు నాగం ప్రాజెక్టుల్లో అవినీతి మీద రాజీలేని పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రాజెక్టుల వారీగా తిరిగి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుల కోసం ఇప్పటి వరకు 7,500 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని ఆయన తెలిపారు.