: ఆస్తి కోసమే ప్రత్యూషపై ఇంతటి అమానుషం: తేల్చిన పోలీసులు
హైదరాబాదులోని బండ్లగూడలో పినతల్లి దాష్టీకానికి బలైన ప్రత్యూష ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఇంతటి అమానుష ప్రవర్తన వెనుక ఉన్న కారణాలను పోలీసులు విచారణలో తేల్చారు. ప్రత్యూష పేరిట ఉన్న ఆస్తిని కాజేసేందుకు ఆమె సవతితల్లి చాముండేశ్వరి రోజూ హింసించేదని తెలిపారు. 2003లో రమేష్ తన మొదటి భార్య సరళాదేవితో విడాకులు తీసుకున్న సమయంలో పద్మారావు నగర్ లో ఉన్న ఓ అపార్టుమెంటును ప్రత్యూష పేరిట రాయాలన్న ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అనంతరం సరళాదేవి మృతి చెందడంతో, బంధువులు ప్రత్యూషను అనాధ శరణాలయంలో చేర్పించారు. ఆ ఆస్తిపై కన్నేసిన చాముండేశ్వరి ప్రోద్బలంతో, మైనారిటీ తీరిన తరువాత తండ్రి రమేష్ ప్రత్యూషను తన ఇంటికి తెచ్చాడు. ఆ ఇంటి విలువ కోటి రూపాయలకు పైగా ఉండడంతో చాముండేశ్వరిలోని రాక్షస కోణం బయటికొచ్చి ప్రత్యూషను చిత్రహింసల పాలు చేసింది. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న రమేష్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. చాముండేశ్వరిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టిన పోలీసులు ఆమెను రిమాండుకు తరలించారు.