: ఆ దేశంలో మన సినిమా పాటలు రింగ్ టోన్లుగా వాడడం కుదరదు!


బంగ్లాదేశ్ లో భారత సినిమా పాటలను రింగ్ టోన్లుగా వినియోగించడంపై నిషేధం విధించారు. భారత్, ఉపఖండంలోని ఇతర దేశాలకు చెందిన పాటలను రింగ్ టోన్లుగా ఉపయోగించరాదంటూ ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఫరా మహబూబ్, కాజీ ఎజారుల్ లతో కూడిన ఢాకా హైకోర్టు బెంచ్ ఓ రిట్ పిటిషన్ పై వాదనలు విన్న అనంతరం ఈ మేరకు పేర్కొంది. పిటిషన్ దారుల న్యాయవాది మెహది హసన్ చౌదరి మాట్లాడుతూ... ఈ పాటలను, ట్యూన్లను వాల్యూ యాడెడ్ సర్వీసుల (వీఏఎస్) కింద వినియోగదారులకు ఆఫర్ చేయడాన్ని ఎందుకు అక్రమమని ప్రకటించకూడదు? అని కోర్టు అభిప్రాయపడిందని తెలిపారు. అంతేగాకుండా, నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ సాంస్కృతిక, సమాచార, హోం, న్యాయ మంత్రిత్వ శాఖలను, బీటీఆర్సీ చైర్మన్ ను, దేశంలోని అన్ని మొబైల్ ఆపరేటర్లను న్యాయస్థానం ఆదేశించిందని వివరించారు. జూన్ మాసంలో బంగ్లాదేశ్ లోని మ్యూజిక్ ఇండస్ట్రీస్ యజమానుల సంఘం అధ్యక్షుడు ఏకేఎం ఆరిఫుర్ రెహ్మాన్, జనరల్ సెక్రటరీ ఎస్కే షాహెద్ అలీ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పైవిధంగా పేర్కొంది. బంగ్లాదేశ్ దిగుమతుల పాలసీని అనుసరించి భారత్, ఇతర ఉపఖండ దేశాల నుంచి సినిమాల దిగుమతిపై నిషేధం ఉందని, అలాంటప్పుడు ఆ సినిమాల తాలూకు పాటలను రింగ్ టోన్లుగానూ, వెల్ కం ట్యూన్లుగానూ ఉపయోగించలేమని మెహెదీ హసన్ వివరించారు.

  • Loading...

More Telugu News