: వచ్చే మూడేళ్లలో ఎంతమంది భారతీయులు మిలియనీర్స్ అవుతారో తెలుసా?
మరో మూడేళ్లలో ఇండియాలోని మిలియనీర్స్ సంఖ్య 4.37 లక్షలకు చేరుతుందని 'వెల్త్ ఎక్స్' విడుదల చేసిన అధ్యయనం వెల్లడించింది. 2023 నాటికి ధనవంతుల సంఖ్య 8.6 లక్షలను దాటుతుందని అంచనాలు వేసింది. ఇండియాలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కుల వ్యవస్థ ధనికులు, పేదల మధ్య అంతరాన్ని మరింతగా పెంచిందని 'డికేడ్స్ ఆఫ్ వెల్త్: ది నెక్ట్స్ 10 ఇయర్స్ ఇన్ వెల్త్ అండ్ లగ్జరీ' పేరిట విడుదల చేసిన స్టడీలో వివరించింది. దీనివల్ల ధనవంతుల సంఖ్య మరింత వేగంగా పెరుగుతోందని తెలిపింది. దీనికితోడు వేగవంతమైన వృద్ధి కోసం మోదీ సర్కారు తీసుకుంటున్న చర్యలు 'అల్ట్రా రిచ్ పాపులేషన్' పెరగడానికి కారణం కానుందని అభిప్రాయపడింది. గడచిన సంవత్సరం వ్యవధిలో ఇండియాలోని మిలియనీర్ల సంఖ్య 1.96 లక్షల నుంచి 27 శాతం వృద్ధితో 2.50 లక్షలకు పెరిగిందని పేర్కొంది. ఇండియాతో పాటు దక్షిణాఫ్రికాలో సైతం ధనికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోందని వెల్త్ ఎక్స్ వివరించింది.