: తాజ్ మహల్ వద్ద 'రోమియో'... ఆకతాయిల ఆటకట్టిస్తుంది!
దేశంలో సుప్రసిద్ధ సందర్శనీయ స్థలం, చారిత్రక ప్రాశస్త్యం ఉన్న తాజ్ మహల్ వద్ద కొంతకాలంగా ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. మహిళలపై వేధింపుల ఘటనలు తరచుగా నమోదవుతుండడాన్ని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే, తాజ్ వద్ద చిల్లరవేషాలు వేసే పోకిరీలకు చెక్ పెట్టేందుకు 'రోమియో టీమ్' ను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. పర్యాటకులను ఇబ్బందులకు గురిచేసే వారిని ఈ టీమ్ లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ రోమియో బృందంలో సీఐఎస్ఎఫ్ దళాలకు చెందిన పురుష, మహిళా సిబ్బంది సభ్యులుగా ఉంటారు. వీరు సాధారణ దుస్తుల్లో విధులు నిర్వర్తిస్తారు. వేధింపుల రాయుళ్లనే కాదు, జేబుదొంగలను, చెయిన్ స్నాచర్లను కూడా ఈ టీమ్ పట్టుకుంటుంది. మరి, 'రోమియో' ఎలాంటి పనితనం కనబరుస్తుందో చూడాలి!