: దెందులూరు ఎమ్మెల్యే రౌడీ షీటరట...ఏలూరు పీఎస్ లో ఆయనపై రౌడీ షీట్
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వచ్చిన మహిళా తహశీల్దార్ పై అనుచరులతో కలిసి దాడి చేసిన టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రౌడీ షీటరట. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు చెందిన ప్రభాకర్ ది ఆది నుంచి వివాదాస్పద వైఖరేనట. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేని అంతకుముందు తన సొంత మండలం పెదవేగికి ఎంపీపీగా పనిచేశారు. 2009లో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పార్టీ నేతలతో అంటిపెట్టుకుని తిరుగుతూ పలు విమర్శలకు తెరలేపిన వ్యక్తిగా పేరుంది. ఏలూరులోని పోలీస్ స్టేషన్లలో ఆయనపై నమోదైన 14 కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. పట్టణంలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. ఆది నుంచి పలు వివాదాల్లో చిక్కుకున్న ఆయన మొన్నటి ఎన్నికల్లో దెందులూరు నుంచి విజయం సాధించారు. అయితే ఆయన వ్యవహార సరళిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఇకముందైనా బుద్ధిగా మసలుకోవాలని సూచించి విప్ పదవిని కట్టబెట్టారు. అయితే చింతమనేని వ్యవహారంలో ఎలాంటి మార్పు రాలేదట.