: విశాఖలో ‘బాహుబలి’ ఫ్యాన్స్ వీరంగం...సినిమా ప్రదర్శించడం లేదని థియేటర్ పై దాడి
టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’పై ఆసక్తి క్షణక్షణానికి పెరిగిపోతోంది. ఈ చిత్రాన్ని తొలి ఆటలోనే వీక్షించాలన్న కాంక్షతో చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద టికెట్ల కోసం ప్రేక్షకులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. అయితే ఇంతటి భారీ చిత్రాన్ని ఎందుకు ప్రదర్శించడం లేదని విశాఖపట్నానికి చెందిన ఓ థియేటర్ పై ‘బాహుబలి’ అభిమానులు ఫైరయ్యారు. అంతేకాక చిత్ర ప్రదర్శనకు ఆసక్తి చూపని ఆ థియేటర్ పై కొద్దిసేపటి క్రితం దాడికి దిగారు. ఈ దాడిలో విశాఖలోని దొండపర్తిలోని శ్రీకన్య థియేటర్ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.