: ‘బాహుబలి’ ట్రైలర్స్ అదుర్స్... కట్టిపడేశాయంటున్న సల్మాన్ ఖాన్
టాలీవుడ్ హిట్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు భాషలోనే కాక పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే దీని సత్తా తెలుసుకున్న బాలీవుడ్ అగ్ర నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఈ చిత్రం హిందీ వెర్షన్ ను విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్స్ పై బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్స్ ను అతడు టీవీల్లో చూశాడట. ఈ సందర్భంగా ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ‘బాహుబలి’పై మాట్లాడాడు. ‘‘ఈ మధ్యనే ‘బాహుబలి’ ట్రైలర్స్ ను టీవీల్లో చూశాను. అదిరిపోయాయి. అందులో రానా దగ్గుబాటి నటన బాగా నచ్చింది. రానా గురించే ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నానంటే, చిన్నప్పటి నుంచి అతడు నాకు బాగా తెలుసు. వాళ్ల నాన్న నాకు మంచి ఫ్రెండ్’’ అని పేర్కొన్నాడు.