: భార్యను చంపేసి పోలీసులకు లొంగిపోయాడు


సమాజంలో నైతిక విలువలు పతనమైపోతున్నాయి, క్షణికావేశానికి లోనై ఆత్మీయులను పొట్టనబెట్టుకుంటున్నారు. హైదాబాదులో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను క్షణికావేశానికి లోనై హత్యచేసిన భర్త నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. వివరాల్లోకి వెళ్తే...మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంపేట్ లో నివాసముండే రాజేష్ శర్మ, చార్మినార్ పటేల్ మార్కెట్ లోని ఓ వస్త్రదుకాణంలో సేల్స్ మన్ గా పని చేస్తున్నాడు. ఇతనికి 14 ఏళ్ల క్రితం సరిత (34) అనే మహిళతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంత కాలంగా భార్య సరిత వాట్సప్ లో చాటింగ్ చేయడం గమనించిన రాజేష్ శర్మ ఈ పధ్ధతి సరికాదని, ఛాటింగ్ మానేయమని సూచించాడు. ఈ నేపధ్యంలో ఈ రోజు విధులకు గైర్హాజరై ఇంటిదగ్గరే ఉండిపోయాడు. మధ్యాహ్న సమయంలో భార్య ఫోన్ లో మాట్లాడడం గమనించిన రాజేష్ శర్మ, 'ఎవరితో మాట్లాడుతున్నావ్? ఫోన్ ఇవ్వు' అంటూ భార్యను గద్దించాడు. ఆమె ఫోన్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహించిన రాజేష్ శర్మ రాడ్ తీసుకుని భార్య తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అతను నేరుగా మంగళహాట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి, తన భార్యను తానే హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, పోస్టు మార్టం నిమిత్తం ఆమె శవాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News