: వాడి వెకిలినవ్వు వెంటాడుతోంది... 'టాక్సీ ఫర్ ష్యూర్'లో ఢిల్లీ యువతి అనుభవం
యాప్ మాధ్యమంగా క్యాబ్ సేవలందిస్తున్న టాక్సీ ఫర్ ష్యూర్ (ఈ సంస్థను ఇటీవలే ఓలా విలీనం చేసుకుంది) డ్రైవర్ ఒకడు మహిళా కస్టమర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సురభీ అరోరా (21) అనే యువతి దక్షిణ ఢిల్లీలోని సాకేత్ నుంచి శివార్లలోని ఫరీదాబాద్ వరకూ టాక్సీని బుక్ చేసుకుంది. దివేందర్ కుమార్ అనే డ్రైవర్ కారు తీసుకుని వచ్చాడు. ఆపై తనకు జరిగిన అవమానాన్ని, అనుభవాలను ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకున్నారు. దివేందర్ ను జైలుకు పంపాల్సిందేనని డిమాండ్ చేశారు. తాను క్యాబ్ ఎక్కినప్పటి నుంచి డ్రైవర్ అశ్లీల చర్యలకు పాల్పడ్డాడని ఆరోపించారు. తాను ఫోన్లో మాట్లాడుతూ ఉంటే కారులోని మ్యూజిక్ సిస్టమ్ వాల్యూమును విపరీతంగా పెంచాడని, తగ్గించమని కోరినా తగ్గించలేదని తెలిపారు. తన గమ్యస్థానానికి చేరేందుకు 25 నిమిషాల ముందు నుంచి డ్రైవర్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, అసహనంగా అటూ, ఇటూ కదులుతూ, అదో రకంగా కనిపించాడని, డ్రైవింగ్ చేస్తూ హస్తప్రయోగం చేసుకున్నట్టు తాను గమనించానని ఫేస్ బుక్ లో పోస్టు పెట్టింది. ఇంటికి వెళ్లిన తరువాత తాను కారు దిగగా, వాడు అదో రకమైన వెకిలి నవ్వు నవ్వాడని, అది తనను రాత్రుళ్లు వెంటాడుతోందని పేర్కొన్నారు. వాడు కచ్ఛితంగా ప్రమాదకారేనని తెలిపారు. ఈ విషయాన్ని ఓలా క్యాబ్స్ కు తెలిపానని చెప్పారు. అయితే, ఈ విషయంలో ఎటువంటి ఫిర్యాదూ అందలేదని పోలీసులు చెబుతుండగా, ఆ డ్రైవర్ ను విధుల నుంచి తొలగించి బ్లాక్ లిస్టులో పెట్టామని ఓలా తెలిపింది.