: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ ఫైర్...పిల్లిలా మాట్లాడుతున్నారని ఆక్షేపణ
జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలతో పాటు టీఆర్ఎస్ నేతలు కూడా ఒంటికాలిపై లేచారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. సింహంలా గర్జించాల్సిన పవన్ కల్యాణ్... పిల్లిలా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ట్విట్టర్ వేదికగా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓటుకు నోటు కేసుపై పవన్ కల్యాణ్ ప్రసంగం వీడియో ఇప్పుడే చూశాను. పవన్ ఓ గర్జించే సింహం. సింహం ఆలోచించి గర్జిస్తే ఆ గర్జనలకు అర్థం లేదు. పవన్ ప్రసంగంలో నాకు అనిపించింది ఇదే. ఈ విషయం పవన్ కు బాగా తెలుసనుకుంటా. సింహం తెలుసుకోవాల్సింది... సింహం, సింహంలా ఉండాలని. తన గర్జనలోని అంతరార్థాన్ని కుక్కలకు వివరించకూడదు. సింహం జూలో ఉందనే భ్రమలో ఉన్నాయి కుక్కలు. కానీ కుక్కలు తెలుసుకోవలసింది... సింహం తలచుకుంటే ఎప్పుడైనా దాడి చేయగలదని. సింహం గర్జనలోని అర్థాన్ని వెతకటం కుక్కల మొరుగుల్లో లాజిక్ వెతకటం లాంటిదే. సింహం ఆలోచించదు. కుక్కలు ఆలోచిస్తాయి. కానీ ఇక్కడ ప్రాబ్లెం ఏంటంటే, గర్జించే సింహం మేకలా మాట్లాడుతోంది. సారీ పిల్లిలాగా మాట్లాడుతోంది. సింహంలాంటి పవన్ కల్యాణ్ కు నా సలహా.. దయచేసి పిల్లిలా ఉండొద్దు. పులిలా గర్జించాలని మీ అభిమానులు కోరుకుంటున్నారు. మేకకి, మొక్కకు తేడా తెలియని సింహం, సింహమే కాదు’’ అంటూ రాంగోపాల్ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు.