: 'బాహుబలి'తో డాల్బీ అట్మోస్ క్రేజ్ పెరుగుతుందట!
భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మక చిత్రం బాహుబలి ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమౌళి చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ జానపద చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా, ఈ సినిమా కోసం లేటెస్ట్ సౌండ్ సిస్టమ్ వినియోగించారు. ఇప్పటిదాకా ఎక్కువగా డీటీఎస్, డాల్బీ డిజిటల్, టీహెచ్ఎక్స్ శబ్ద అనుభూతులను చవిచూసిన ప్రేక్షకుడిని బాహుబలి కోసం ఉపయోగించిన 'డాల్బీ అట్మోస్' సౌండ్ సిస్టమ్ కొత్తలోకంలోకి తీసుకెళ్లడం ఖాయమని డాల్బీ లేబరేటరీస్ సీనియర్ రీజనల్ డైరక్టర్ (భారత్, ఆగ్నేయాసియా విభాగం) పంకజ్ కెడియా విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలైన అనంతరం మరికొందరు ఫిలిం మేకర్లు 'డాల్బీ అట్మోస్' సౌండ్ సిస్టమ్ కావాలంటారని ఆయన ధీమాగా చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా థియేటర్లో ఏ ప్రదేశంలోనైనా, ఏ తరహా వాయిద్యం తాలూకు ధ్వనినైనా వినిపించవచ్చని వివరించారు. ఈ సౌండ్ సిస్టమ్ సినిమా విజయవంతం కావడానికి మరింత దోహదపడుతుందని అన్నారు. కాగా, 2012లో విడుదలైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ శివాజీ చిత్రం 3డి వెర్షన్ కు డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ ఉపయోగించారు. భారత్ లో ఈ తరహా సౌండ్ సిస్టమ్ తో వచ్చిన తొలి సినిమా ఇదే. 'బాహుబలి' చిత్రంతో 'అట్మోస్' కు క్రేజ్ పెరగడం ఖాయమని డాల్బీ సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది.