: డీఎస్ కాంగ్రెస్ పార్టీని వీడటానికి కారణమిదేనా?


దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఎన్నో పదవులు అనుభవించి, చివరకు టీఆర్ఎస్ పార్టీలో చేరిన డి.శ్రీనివాస్ పై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. డీఎస్ పోవడంతో కాంగ్రెస్ లోని చెత్త పోయినట్టైందని షబ్బీర్ అలీ విమర్శించడం ఆరోపణల తీవ్రతను సూచిస్తోంది. అయితే, డీఎస్ రాజీనామాకు ఇతర కారణాలు కూడా ఉన్నాయన్న వార్తలు బయటకు వస్తున్నాయి. వాస్తవానికి పార్టీ అధ్యక్షురాలు సోనియాతో భేటీ కావడానికి డీఎస్ తీవ్రంగా ప్రయత్నించారట. సోనియా అపాయింట్ మెంట్ కోసం దాదాపు నెల రోజులుగా వేచి చూసినప్పటికీ ఫలితం లేకపోవడంతో డీఎస్ నిరాశకు గురయ్యారట. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారట. తనకు రాజ్యసభ, తన కుమారుడికి శాసనమండలి సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చిన అధిష్ఠానం, చివరకు ఆ విషయాన్ని పట్టించుకోలేదని సన్నిహితులతో డీఎస్ వాపోయారట. గతంలో తనకు సోనియా అపాయింట్ మెంట్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దొరికేదని... కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదని బాధపడ్డారట. ఒకవేళ సోనియా అపాయింట్ మెంట్ ఇచ్చి ఉంటే, పార్టీ మారే విషయంలో మరోసారి ఆలోచించేవాడినని... కానీ అలా జరగలేదని డీఎస్ వ్యాఖ్యానించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News