: ముస్లింలకు మోదీయే చెప్పాలి: శివసేన
ముస్లింలకు దీటుగా నిలిచేందుకు హిందూ జనాభాను పెంచుకుంటూ పోవడం సమస్యకు పరిష్కారం కాదని శివసేన అభిప్రాయపడింది. ఈ విషయంలో 'సంఘ్' చొరవ తీసుకోవాలని, కుటుంబ నియంత్రణ అన్ని మతాలకు కచ్చితంగా వర్తింపజేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించింది. ముస్లిం జనాభా నానాటికీ పెరుగుతున్న కారణంగా దేశంలో భాషా సంబంధ, భౌగోళికపరమైన అసమతుల్యత ఏర్పడుతుందని హెచ్చరించింది. తద్వారా దేశ సమైక్యతకు బీటలువారే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. అందుకే, కుటుంబ నియంత్రణ పాటించాలని ముస్లింలకు ప్రధాని నరేంద్ర మోదీయే సూటిగా చెప్పాలని సూచించింది. "దేశ చట్టాన్ని గౌరవించాలని, కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యతను గుర్తించాలని ఆయన ముస్లింలకు వివరించాలి. ముస్లింలు అర్ధరాత్రి వచ్చి తన ఇంటి తలుపు తట్టినా వారి సమస్యలు పరిష్కరిస్తాను అని ప్రధాని హామీ ఇచ్చారు. అదే రీతిలో ముస్లింలు కూడా బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన అవసరం లేదా?" అని శివసేన తన సామ్నా పత్రికలో పేర్కొంది. దేశంలో లోక్ పాల్ కంటే కామన్ సివిల్ కోడ్ అవసరమని అభిప్రాయపడింది. "ఘర్ వాపసీ కార్యక్రమాలు నిర్వహించేవారు నిరభ్యంతరంగా నిర్వహించుకోవచ్చు. మేం అందుకు అభ్యంతరం చెప్పబోము. అయితే, ఇస్లామిక్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఇది పరిష్కారం కాదు" అని పేర్కొంది.