: ఆంధ్రోళ్లు అనొద్దు... అది కులం కాదు, మతం కాదు: పవన్ కల్యాణ్
తెలంగాణను 1960లో విడదీసి ఉంటే సమస్య ఇలా ఉండేది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 'హైదరాబాదు తమది అని తెలంగాణవారు అంటున్నారు. మరి పదేళ్ల వరకు ఏపీ రాజధాని ఏది?' అని ఆయన నిలదీశారు. ఈ రీతిగా విడదీయడం అన్యాయం అని అందరూ ఒప్పుకుంటారని, కానీ స్వప్రయోజనాలు నెరవేరవేమోననే భయంతో మాదంటే మాది అని తిట్టుకుంటున్నారని ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు ప్రభుత్వాలు కొట్టుకుంటూ పోతే సివిల్ వార్ కు దారితీసే అవకాశం ఉందని ఆయన సూచించారు. మాట్లాడేటప్పుడు ఆంధ్రోళ్లు, సెటిలర్స్ అనే పదం వాడవద్దు అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బాధ్యతగల పదవుల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు తనకు ఎవరితోనూ వ్యక్తిగతమైన విభేదాలు లేవని, ఉన్నవన్నీ సైద్ధాంతికపరమైన విభేదాలేనని పవన్ కల్యాణ్ తెలిపారు. 'తెలంగాణ మంత్రి హరీష్ రావు మాట్లాడిన ప్రతిసారి ఆంధ్రోళ్లు అంటారు. ఆంధ్రా అనే శబ్దం దేనిని సూచిస్తుందో ఆయన తెలుసుకోవాలని సూచించారు. 'చంద్రబాబును తిట్టాలనుకుంటే నేరుగా ఆయనని తిట్టండి, చేతకాకపోతే నోరు మూసుకోండి' అని తెలిపారు. 'లేదు పవన్ కల్యాణ్ ను తిట్టాలంటే పేరు పెట్టి తిట్టండి, అంతే కానీ ఆంధ్రోళ్లు అని తిట్టకండి' అని ఆయన సూచించారు. ఆంధ్రోళ్లు అంటే మాలలు, మాదిగలు, హరీష్ రావు గారికి ఇష్టమైన బొత్స గారి కులం కాపులు, ఎస్టీలు, కమ్మ, రెడ్డి... ఇలా ఎన్నో కులాలకు, మతాలకు చెందిన ప్రజలని గుర్తించాలని ఆయన సూచించారు.