: ‘అనంత’లో నకిలీ పట్టాదారు పాస్ బుక్కుల రాకెట్...నిందితుల్లో మీడియా ప్రతినిధులు
అనంతపురం జిల్లాలో నకిలీ పట్టాదారు పాస్ బుక్కుల కుంభకోణం వెలుగు చూసింది. జిల్లాలోని ధర్మవరం కేంద్రంగా గడచిన పదిహేనేళ్లుగా కొనసాగుతున్న ఈ దందాపై తాజాగా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలోని బత్తలపల్లి మండలంలోనే ఏకంగా 17 వేల నకిలీ పాస్ బుక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగానూ నకిలీ పాస్ బుక్కులు జారీ అయ్యాయన్న వాదన కూడా వినిపిస్తోందని కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు. ఓ వీఆర్వో సహకారంతో రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, ప్రైవేట్ వ్యక్తులు జట్టుకట్టి ఈ నకిలీ దందాను నడిపినట్లు ఆధారాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 12 మంది నిందితులను పట్టుకున్నామని, పరారీలోని నిందితులను కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.